ఢిల్లీ: ఢిల్లీ కాపలాదారు, 'మఫ్లర్ మ్యాన్'గా సామాజిక మాధ్యమాల్లో పేరొందిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. తాను ఎక్కువగా ధరించడానికి ఇష్టపడే 'మఫ్లర్' ను ఇంకా ధరించకపోవడం అటు నెటిజన్లతో పాటు సాధారణ జనాన్ని ఒకింతా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 'మఫ్లర్ మ్యాన్ అని ట్రోల్ చేస్తున్నారు.. అందుకే మఫ్లర్ విడిచారా' అని ఒకరు ప్రశ్నించగా, 'శీతాకాలం ప్రారంభమైనా ఈసారి మఫ్లర్ ఇంకా బయటకు రాలేదు.. చలి కూడా ఎక్కువగానే ఉంది. ఏమైంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు' అంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
దీంతో ఎట్టకేలకూ అరవింద్ కేజ్రీవాల్ వారి ట్వీట్‌లకు నవ్వుకుంటూ స్పందించారు. 'మఫ్లర్ ఎప్పుడో బయటికి వచ్చింది. మీరే గమనించలేదు. చలి తీవ్రత పెరిగింది. అందరూ జాగ్రత్తలు తీసుకొండి' అని ట్విటర్ ద్వారా తన అభిమానులకు, ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువ కారణంగా జలబు, దగ్గు బారినపడకుండా రక్షణ కోసం అరవింద్ కేజ్రీవాల్ మఫ్లర్ ఎక్కువగా ధరిస్తారు.